భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు
దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి ఎంపిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, సుద్దపల్లికి చెందిన దయ్యాల లిఖిత, ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన ఇర్నాల వర్షిణి భారత జట్టులో స్థానం సంపాదించారు.
జూలై 24, 25 తేదీల్లో మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో నిర్వహించిన తొలి దశ సెలెక్షన్ ట్రయల్స్‌లో దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి చక్కటి ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. అనంతరం ఆగస్టు 24, 25 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన రెండో దశ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ తమ ప్రతిభను కొనసాగించి ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించారు.
ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో నిర్వహించిన తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల తుది జట్టుకు ఎంపికయ్యారని జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి తెలిపారు.
అలాగే, అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించనున్న తుది శిక్షణ శిబిరంలో క్రీడాకారిణులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు చైనాలోని వెయిహైలో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణిలను ఘనంగా సన్మానించి అభినందించారు. జిల్లా క్రీడాకారిణులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులోనూ జిల్లాలోని మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ టి. నళిని, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, పీడీ జ్యోత్స్న, పీఈటీ నర్మదా, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

























