భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభావంతమైన క్రీడాకారిణులు భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు ఎంపికయ్యారు. డిచ్‌పల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలకు చెందిన దయ్యాల లిఖిత (సుద్దపల్లి), ఈర్నాల వర్షిణి (ధర్మారం–బి) తమ ప్రతిభతో భారత జట్టులో స్థానం సంపాదించారు.
ఈ విషయాన్ని జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి తెలిపారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన దయ్యాల లిఖిత, ధర్మారం–బి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన ఈర్నాల వర్షిణి భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 12 నుంచి 18 వరకు చైనాలోని వెయిహైలో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో దయ్యాల లిఖిత, ఈర్నాల వర్షిణి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు.
భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులను సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నిజామాబాద్ జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి, ధర్మారం–బి పాఠశాల ప్రిన్సిపల్ మాధవలత, సుద్దపల్లి పాఠశాల ప్రిన్సిపల్ టి. నళిని ఘనంగా సన్మానించి అభినందించారు.
క్రీడాకారిణులను ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన ధర్మారం–బి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నీరజ రెడ్డి, పీఈటీ స్వప్న, సుద్దపల్లి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, పీఈటీలు జ్యోత్స్న, నర్మదా, అకాడమీ కోచ్ మౌనికలను ఈ సందర్భంగా అభినందించారు.
జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

























