నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.సంతోష్ వీడియో విడుదల…
హత్యకు గురైన హరిబాబు ఉదంతంలో వైష్ణవి సోదరుడు సంతోష్ సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. తన చెల్లిని గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేసినట్లుగా ఆ వీడియోలో సంతోష్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన చెల్లి హత్యకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసిన సంతోష్, చెల్లి మరణానికి ఇలా న్యాయం చేసుకున్నానని పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి తాను నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నానని ఆ వీడియోలో సంతోష్ స్పష్టం చేశాడు. ఈ పరిణామంతో నిజామాబాద్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, యూట్యూబర్ వైష్ణవి 2025, సెప్టెంబర్ 17న హరిబాబు చేతిలో హత్యకు గురికాగా.. సంవత్సరం తిరిగేసరికి మళ్లీ సరిగ్గా ఇదే రోజున హరిబాబు, ఆమె సోదరుడు సంతోష్ చేతిలో రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది.























