సీతారాం నగర్ కాలనీలో వీధిదీపాలు లేక ఇబ్బందులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ నగరం, సెప్టెంబర్ 23:నిజామాబాద్ నగరంలోని 8వ వార్డు పరిధిలో ఉన్న సీతారాం నగర్ కాలనీ, బంగారు మైసమ్మ వీధి, రోడ్డు నంబర్ 6లో వీధిదీపాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో వీధులు చీకటిగా ఉండటంతో కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి, తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా వీధుల్లో కుక్కల సంచారం పెరగడంతో పాటు పాములు, తేళ్లు వంటి విషపురుగులు ఇళ్ల పరిసరాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కాలనీలో వీధిదీపాల సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమను సంప్రదించి ఓట్లు కోరిన ప్రజాప్రతినిధులు, ఎన్నికల అనంతరం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా 8వ వార్డు కార్పొరేటర్ మటన్ పవన్ కుమార్ స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

























