చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి…
బాబాపూర్ గ్రామ సర్పంచ్ ఎం.ఏ. సమీర్ పిలుపు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
గ్రామంలోని చిన్నపిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య శిబిరాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని బాబాపూర్ గ్రామ సర్పంచ్ ఎం.ఏ. సమీర్ కోరారు. నిజామాబాద్‌లోని ఆర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ సమద్ నేతృత్వంలో ఆరుగురు చిన్న పిల్లల డాక్టర్ బృందంతో కలిసి ఆదివారం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామ కమిటీ హాల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎం.ఏ. సమీర్ మాట్లాడుతూ.. చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఉచిత శిబిరం ద్వారా పిల్లలకు వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను శిబిరానికి తీసుకువచ్చి వైద్య సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.























