అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగమ్మ గుడి వెనుక ఉన్న గుట్టపై షేక్ రాజీ సాబ్ (51) అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు ఈ నెల 29వ తేదీ ఉదయం సుమారు 6 గంటలకు మరమరాలు విక్రయించేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో అక్టోబర్ 30వ తేదీ ఉదయం 8:45 గంటల సమయంలో నర్సింగ్‌పల్లి గ్రామ శివారులోని గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు మృతుడు తమ తండ్రి షేక్ రాజీ సాబ్‌గా గుర్తించారు.
మృతుడి ముఖం, తలపై గాయాలు ఉండటంతో పాటు, ఆయన వద్ద ఉన్న డబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

























