లింబాద్రిగుట్ట జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు.. ఉచిత పార్కింగ్, వన్‌వే ట్రాఫిక్ అమలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు భీంగల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇతర మండల అధికారులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతర ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
గతేడాది జాతరలో విజయవంతమైన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ఈసారి కూడా అమలు చేయనున్నట్లు సీఐ తెలిపారు. లింగాపూర్ చౌరస్తా మీదుగా వాహనాలు వచ్చి భీంగల్ వైపు వెళ్లేలా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జాతర సమయంలో రహదారులపై వాహనాల రద్దీని నియంత్రించి, భక్తులు సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
గతేడాది టోల్ వసూళ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి టోల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. భక్తులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం ప్రత్యేకంగా నాలుగు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు.
అదేవిధంగా భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు వీఐపీ టికెట్లు, ప్రత్యేక పాస్‌ల విధానాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. గతంలో వీఐపీ దర్శనానికి వినియోగించిన మార్గాన్ని ఈసారి సర్వదర్శనం ఎగ్జిట్ మార్గంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. దీనివల్ల దర్శనం అనంతరం భక్తులు సులభంగా బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ, ట్రాఫిక్ నిబంధనలకు సహకరించి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని సీఐ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

























