ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ బి. నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్, సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నవారు, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు పెండింగ్ చలాన్లు చెల్లించేలా చర్యలు చేపట్టారు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనల ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ప్రజల భద్రతే మా లక్ష్యం అని పోలీసులు తెలిపారు.

























