కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన
శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి – డీజీపీ
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలి
బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కె హరీష్
కామారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఐపీఎస్ శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీకి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ, పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా పోలీస్ శాఖ పనితీరు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన కేసుల పురోగతి, ఆపరేషన్ కవాచ్, సైబర్ నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. సుమారు 20 సంవత్సరాల తర్వాత తిరిగి కామారెడ్డి జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నక్సలిజం, మావోయిస్టుల సంచారం, క్లేమోర్ మైన్లు, ల్యాండ్ మైన్ల వంటి సవాళ్లు ఉండేవని, ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు, పోలీసుల సమష్టి కృషితో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించగలిగామని తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర నాయకత్వంలో కామారెడ్డి పోలీసులు ఆపరేషన్ కవాచ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌లను, ఆస్తి సంబంధిత నేరాలను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. సైబర్ నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సాధిస్తున్న ఫలితాలు అభినందనీయమన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నేరస్తులు, హిస్టరీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆపరేషన్ కవాచ్ చెక్‌పోస్టుల ద్వారా అంతర్రాష్ట్ర నేర ముఠాలను అడ్డుకోవడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించాలని ఆదేశించారు.
మాదకద్రవ్యాల సమస్య దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిందని, యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ పేర్కొన్నారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో సమన్వయం చేసుకుంటూ మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థులు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హెచ్చరించారు. డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్ మోసాల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ప్రత్యేక సైబర్ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షించి ర్యాంకులు కేటాయించాలని సూచించారు. వెనుకబడిన పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ పద్ధతుల ద్వారా నేరాల మూలాలను గుర్తించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
గణేష్ నవరాత్రులు, దసరా, బతుకమ్మ, దీపావళి, మొహర్రం వంటి పండుగల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.
నిరంతరం విధుల ఒత్తిడిలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)లో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మల్టీ జోన్-1 ఐజీపీ కార్తికేయ, ఐపీఎస్, జోన్-3 ఇన్చార్జ్ డీఐజీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, హైదరాబాద్ సీఐడీ డీఐజీ కె. నారాయణ నాయక్, ఐపీఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, సీఐడీ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఐపీఎస్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ (ఈస్ట్) ఆర్. గిరిధర్, ఐపీఎస్‌తో పాటు జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పోలీసుల సమష్టి కృషిని అభినందించిన డీజీపీ.. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

























