ఓం శ్రీ ధర్మశాస్తా ! కరుణాహృదయా ! భక్త వత్సలా ! నీకు నమస్మృతులు. సాష్టాంగ ప్రణామములు. నీవు సచ్చిదానందుడవు ! సర్వవ్యాపివి ! సర్వశక్తి మయుడవు ! సకల జీవహృదయాంతర్యామివి! కరుణామయుడవు ! కరుణార్ధ హృదయుడవు ! హే అన్నదాన ప్రభూ ! మాకు కరుణాహృదయము , శ్రద్ధా , భక్తి , విజ్ఞానములను ప్రసాదించుము. ప్రలోభముల నరికట్టి , చిత్తవృత్తులను నిరోధించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని మాకు అనుగ్రహింపుము. కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , ద్వేష , దురహంకారముల నుండి మమ్ము తప్పింపుము , దైవ సంపదతో మా హృదయములను నింపుము. నీనామ రూపము అన్నింటి యందును నిన్నే దర్శింతుము గాక. నీనామరూపములన్నింటి యందును నిన్నే స్మరించెదముగాక.నీ మహిమలెల్లప్పుడు కొనియాడు చుందుముగాక. నీ హృదయమునందే మేము శాశ్వతముగా వసింతుముగాక. నీ నామము నిరంతరము మా నాలుకపై పలుకుచునే యుండుగాక. ఓ హరిహర పుత్రా ! అయ్యప్పస్వామీ ! కరుణాహృదయా ! సర్వేశ్వరా !
మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందును నీపాదార విందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో గూడి యుండునట్లు అనుగ్రహింపుము. ఓ శబరి మలేశ్వరా ! అయ్యప్పస్వామీ ! పరమ దయానిధి ! ప్రాతఃకాలమున నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకు మనోవాక్కాయకర్మలచే మా వలన ఎవరికి ఎట్టి అపకారము కలుగక యుండునట్లుగను , సర్వ ప్రాణికోట్లకు ఉపకారము చేయునట్టి సద్బుద్ధిని మాకు ప్రసాదింపుము. ఓ ఆపద్బాంధవా ! అనాథ రక్షకా ! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా ! అయ్యప్పస్వామీ ! సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా అంతః కరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పముగానీ , విషయ వాసనగానీ , అజ్ఞాన వృత్తిలో గానీ , జారబడ కుండునట్లు మమ్ము దయతో అనుగ్రహింపుము.
ఓ మహిషీమర్దనా ! లోకపూజ్యేశ్వరా ! దయామయా ! అయ్యప్ప స్వామీ ! వేదాంత వేద్యా ! అభయస్వరూపా ! భక్తి జ్ఞాన వైరాగ్య మనెడి బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధులగునట్లు దయతో ఆశీర్వదింపుము మరియు ఈ జన్మమునందే కడతేర్చి నీ సానిధ్యము నకు ఏతెంచుటకు కావలసిన శక్తిసామర్థ్యములను కరుణతో అనుగ్రహింపుము. ఓ పతిత పావనా ! పంబా బాలా ! జ్యోతిస్వరూపా ! మణికంఠస్వామీ ! దేవాదిదేవా ! నీవు భక్తవత్సలుడవు. దీనుల పాలిట కల్పవృక్షమా ! నీవు తప్ప మాకింకెవరు దిక్కు , నిన్ను మేమాశ్రయించి తిమి ! అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము. మృత్యువు నుండి అమరత్వము పొందింపుము. ఇదే మావినతి. అనుగ్రహింపుము. స్వామీ నీదరి జేర్చుకొనుము. అందులకు ప్రతిగా మేము సర్వకాల సర్వావస్థల యందు మీ శరణ నామములను పట్టి వదలక పలుకుతూ ఉంటాము.
మమ్మాదుకో హరిహరపుత్రా ! అయ్యప్పస్వామీ ! ఓ శబరిగిరీశ్వరా ! మణికంఠదేవా ! జ్యోతి స్వరూపా ! పాహిమాం ! పాహిమాం ! పాహిమాం ! రక్షమాం ! రక్షమాం ! రక్షమాం !
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*

























