ప్రేమ మోసాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
వాగ్దేవి పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డిలోని వాగ్దేవి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ల డ్రైవింగ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, బాలలపై జరిగే నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాటలు, పాటల ద్వారా కళాబృందం సభ్యులు వివరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను అప్రమత్తంగా ఉపయోగించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
సైబర్ నేరాల బారినపడినవారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు 1908 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. షీటీమ్ సహాయం కోసం 87126 86094, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతితో పాటు కానిస్టేబుళ్లు యు. శేషరావు, ప్రభాకర్, సాయిలు పాల్గొన్నారు. షీటీమ్ విధులు, మహిళల రక్షణ, పోక్సో చట్టం, బాలలపై జరిగే నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన చర్యల గురించి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

























