మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ
సఖి వన్ స్టాప్ సెంటర్ పోస్టర్, పాంప్లెట్లను ఆవిష్కరించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: మహిళల హక్కుల పరిరక్షణకు, గృహహింస బాధితులకు న్యాయం అందించేందుకు ‘మిషన్ అపరాజిత’ అండగా నిలుస్తుందని కార్యక్రమ బాధ్యులు, అడ్వకేట్లు భానుప్రియ, లావణ్య తెలిపారు.
భీంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు మిషన్ అపరాజిత–సఖి వన్ స్టాప్ సెంటర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, పాంప్లెట్లను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అడ్వకేట్లు భానుప్రియ, లావణ్య మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, గౌరవప్రదంగా జీవించేందుకు మిషన్ అపరాజిత ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. గృహహింస నిరోధక చట్టం (డీవీ యాక్ట్) ద్వారా మహిళలకు లభించే చట్టపరమైన రక్షణ, హక్కులపై అవగాహన కల్పించారు.
డీవీ యాక్ట్ కింద బాధిత మహిళలు, పిల్లలకు రక్షణ, నివాస సదుపాయం, భరణం, పరిహారం తదితర అంశాల్లో చట్టప్రకారం న్యాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. మహిళలు ఎలాంటి హింసకు గురైనా భయపడకుండా తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి సహాయం పొందాలని సూచించారు.
మహిళల ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 181 అందుబాటులో ఉందని, అవసరమైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం, హింసకు గురైన బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

























