తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జాతీయ రహదారి–44పై ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. అదే ప్రాంతంలో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను తనిఖీ చేసి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నేషనల్ హైవే మేనేజర్ (టెక్నికల్) రంగారావు, హైవే కాంట్రాక్టర్ బాల్‌రెడ్డితో మాట్లాడిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ రహదారిపై వాహనదారులు వేగాన్ని నియంత్రించుకునేలా అవసరమైన ప్రదేశాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి వేళల్లోనూ ప్రమాదకర ప్రాంతాలు వాహనదారులకు ముందుగానే కనిపించేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. టోల్‌ప్లాజా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖతో పాటు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ, కాంట్రాక్టర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, నేషనల్ హైవే మేనేజర్ రంగారావు, హైవే కాంట్రాక్టర్ బాల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మలేష్, డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. వినోద్, ఇందల్వాయి ఎస్ఐ సుమలత, చంద్రాయన్పల్లి సర్పంచ్ రఘు, టోల్‌ప్లాజా సిబ్బంది, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

























