దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!
పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: దీపావళి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాటను పూర్తిగా నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో పేకాట నిర్వహణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పండుగ సమయంలో ఎవరైనా పేకాట ఆడినా, పేకాట స్థావరాలు నిర్వహించినా, ఇతరులను పేకాట ఆడేందుకు ప్రోత్సహించినా లేదా పేకాట నిర్వహణకు సహకరించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
పండుగ నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడుతున్నా, ఆడిస్తున్నా లేదా నిర్వహణకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ప్రజలందరూ పోలీసులకు సహకరించి దీపావళి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.

























