చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు
గొర్రెల కాపరుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.. శిశువును రక్షించిన పోలీసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
దోమకొండ: కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దోమకొండ మండలంలోని శివారులో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలివెళ్లడం కలకలం రేపింది. గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్న కాపరులకు పొదల్లో నుంచి శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే జన్మించిన శిశువు కనిపించింది. దీంతో వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించారు. తొలుత దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి పంపించారు. గొర్రెల కాపరులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పసికందుకు ప్రాణాపాయం తప్పింది. శిశువును ఎవరు వదిలివెళ్లారు? ఏ పరిస్థితుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.























