5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన!
పోటీలు నిర్వహించే ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించిన సీపీ సాయి చైతన్య ఐపీఎస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, స్విమ్మింగ్, ఆర్చరీ తదితర విభాగాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా జానకంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రం (పీటీసీ), మోపాల్‌లో ఏర్పాటు చేస్తున్న ఆర్చరీ పోటీల ప్రాంగణం, అలీసాగర్ బోటింగ్ ప్రాంతం, నిజామాబాద్‌లోని ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్, పాల్దా, జన్నపల్లి ప్రాంతాల్లో అథ్లెటిక్స్, రన్నింగ్ పోటీల నిర్వహణకు ఎంపిక చేసిన ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరుకానున్న పోలీస్ క్రీడాకారులు, అధికారులు, అతిథుల కోసం కల్పించనున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
క్రీడా పోటీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్రీడాకారులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని, పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, ట్రాఫిక్ విభాగాల ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం, మస్తాన్ అలీ, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, డీవైఎస్‌ఓ పవన్ కుమార్, ఆర్చరీ కోచ్ ఎన్. రవీందర్, అథ్లెటిక్స్ సెక్రటరీ, కోచ్ రాజా గౌడ్, స్విమ్మింగ్ ఇన్‌చార్జి ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

























