గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!
కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని, గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి కామారెడ్డి పట్టణంలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఎల్లంకి సుదర్శన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు విద్యాసంస్థలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా వాసవి స్కూల్, ప్రొబెల్స్ స్కూల్, ప్రభుత్వ కళాశాల, కిసాన్ షాపింగ్ మాల్‌తో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల సంస్థలను సందర్శించి సంతకాలు సేకరించారు. గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమానికి విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు సానుకూలంగా స్పందించారు. ఉద్యమానికి తమ మద్దతు ప్రకటిస్తూ సంతకాల సేకరణలో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు.
కామారెడ్డి పట్టణంలో వేలాది సంతకాలు సేకరించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని ఎల్లంకి సుదర్శన్ తెలిపారు.

























