“అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా బీజేపీ వ్యవహారం” – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
ధర్పల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మద్దుల్ తాండాలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ నిధులను సమీకరించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. తాండాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో సంపాదించిన ప్రభుత్వ ఆస్తులు, సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. “అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా బీజేపీ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం” అని విమర్శించారు.
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని, అయితే ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ప్రచారాలతో నిజాలను మార్చలేరని స్పష్టం చేశారు.
అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. “ఇంట్లో పంచాయతీ పెట్టుకుని కాంగ్రెస్ను తిడుతున్న బీఆర్ఎస్ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్లు నీతులు చెబుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రైతును రాజుగా నిలబెట్టేందుకు రైతు సంక్షేమ పథకాలు, మహిళల ఆర్థిక సాధికారత, విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలుస్తోందన్నారు.
ఈ సందర్భంగా మద్దుల్ తాండా కళ్యాణ మండప నిర్మాణానికి తన వంతు సహకారంగా రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే మద్దుల్ తాండాకు 17 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు సుమారు రూ.50 లక్షల విలువైన రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె నరేష్, నాయకులు బాల్రాజు, ఎర్రన్న, ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, రాంచందర్ గౌడ్, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అంబర్ సింగ్, సంజయ్, గోవర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గోపాల్–అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, తాండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






















