గన్నారం వీడీసీ కమిటీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్వోకు మాదిగ సంఘం వినతిపత్రం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు తమపై విధించిన గ్రామ బహిష్కరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎమ్మార్వో (తహసీల్దార్)కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో, గ్రామంలోని వీడీసీ (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ) సభ్యులు మాదిగ కులస్తులతో ఎవరైనా పని చేయించుకున్నా, వారికి పనులు ఇచ్చినా లేదా వారి వద్దకు పనికి వెళ్లినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం తమ రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని, సామాజిక వివక్షను ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపించారు. గ్రామ బహిష్కరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు, ఇందుకు బాధ్యులైన వీడీసీ కమిటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాదిగ సంఘం నాయకులు ఎమ్మార్వోను కోరారు.
ఈ సందర్భంగా మాదిగ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























