డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి ~ పిడిఎస్ యు డిమాండ్. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనంనిర్మించి,విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో సోమవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రజావాణి, మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా, నిరసనకార్యక్రమం నిర్వహించారు.అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పిడిఎస్ యు జిల్లా నాయకులు ఎం. మున్నా కుమార్ మాట్లాడుతూ డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం విద్యార్థులు చదువుకుంటున్న తరగతి గదులు అత్యంత అధ్వానస్థితిలోఉన్నాయని,కనీస సౌకర్యాలు లేకుండా విద్యను అభ్యసించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వర్షం వచ్చిన సమయంలో పైకప్పు నుంచి నీరు కారడం, రేకులు పగిలిపోవడంతో రంధ్రాల ద్వారా వర్షపు నీరు తరగతి గదుల్లోకి రావడం,విద్యుత్ సమస్యలు,చెత్తాచెదారం తరగతి గదుల్లోకి చేరడం వంటి సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాశాలలో సరైన తరగతి గదులు,ల్యాబ్ సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. డిగ్రీ విద్య అనేది ఉన్నత విద్యలో కీలకమైన దశ అని, అలాంటి ఉన్నత విద్యను అందించే ప్రభుత్వ కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావంచూపుతుందని అన్నారు.ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తామనిచెబుతున్నప్పటికీ, డిచ్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నూతన సొంత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ సమస్యపై తక్షణమే స్పందించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి, భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే కళాశాలలో తక్షణమే తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ల్యాబ్‌లు,సరైన తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు మండల నాయకులు హేమాంజలి, అరవింద్, నితిన్, వైష్ణవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.























