భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా మారి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగడి ప్రాంగణంలో ఎక్కడ చూసినా బురద, నిల్వ నీరు కనిపించడంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంగడిలో కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు సైతం బురద మధ్యనే తమ సరుకులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలతో బురద మరింతగా చెల్లాచెదురవుతూ, పాదచారులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు బురదలో జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అంగడికి భీంగల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారపు అంగడి రోజున రద్దీ ఎక్కువగా ఉండటంతో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ సౌకర్యాలు, రహదారి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగడి ప్రాంగణంలో బురద తొలగించడం, నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట మట్టి లేదా మెటల్ వేసి రహదారిని సరిచేయడంతో పాటు క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భీంగల్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అంగడి ప్రాంగణాన్ని పరిశీలించి, తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వ్యాపారులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

























