2034 లక్ష్యాల దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది: సీఎం రేవంత్ రెడ్డి!
భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
2034 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నిర్మించనున్న డేటా సెంటర్ తొలి అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే క్రమంలో అమెజాన్ భాగస్వామిగా నిలవాలని, 2034 నాటికి రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని కోరారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోని ఫార్చూన్–500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆ దిశగా 108 దేశాలకు చెందిన ప్రతినిధులు, 3 వేలకుపైగా కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినట్లు గుర్తు చేశారు.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో రాష్ట్రం 5 శాతం వాటాను అందిస్తోందని, 2047 నాటికి దీన్ని 10 శాతానికి పెంచడమే లక్ష్యమని చెప్పారు.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఈ విజన్ రూపకల్పనలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకున్నట్లు చెప్పారు.
పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, 2025 డిసెంబర్లో రూపొందించిన పాలసీ ప్రకారం అమెజాన్‌కు భూమి కేటాయించినట్లు తెలిపారు. వచ్చే 14 ఏళ్లలో అమెజాన్ 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ తదితర రంగాలకు ప్రత్యేక విధానాలు తీసుకొచ్చామని, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను కాలుష్యరహిత మహానగరంగా తీర్చిదిద్దేందుకు మూసీ నది ప్రక్షాళన, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సుల ప్రవేశపెట్టడం, ఈవీలకు జీరో టాక్స్ అమలు వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు అభివృద్ధి జోన్లుగా విభజించి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్) హబ్‌గా, ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
అభివృద్ధి కోసం భూములు అందిస్తున్న రైతుల త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారికి మరింత మెరుగైన నష్టపరిహారం, భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, అమెజాన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

























