సైన్స్ బోధనలో వినూత్నత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బాణాల స్వప్న!
కామారెడ్డి జిల్లాకు చెందిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలు బానాల స్వప్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కామారెడ్డి చిన్నమల్లారెడ్డి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బానాల స్వప్న విజ్ఞానశాస్త్ర బోధనలో విశేష ప్రతిభ చూపి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బాణాల స్వప్నా రెడ్డి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలకే పరిమితమైన చదువు కంటే ప్రయోగాలతో సాగే అభ్యసనం విద్యార్థుల మెదళ్లకు ఎంతటి పదును పెడుతుందో ప్రత్యక్షంగా నిరూపించారామె. గ్రామీణ విద్యార్థినుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నాటి, వారి ఆలోచనలకు రెక్కలు తొడిగి జాతీయ వేదికలపై సగర్వంగా నిలిపిన ఆ గురుమాత విద్యా ప్రస్థానం ఎలా సాగింది? మారుమూల తరగతి గది నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వరకు రావడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. మొదట రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన స్వప్న, ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లో సేవలందించారు. సైన్స్ పాఠాలను విద్యార్థుల మనసుల్లో నాటుకుపోయేలా అరటిపండు ఒలిచిపెట్టిన చందంగా ప్రయోగాల రూపంలో బోధించడం ఆమె శైలి. ఈ ఏడాది నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’లో తమ పాఠశాల విద్యార్థినులను తీర్చిదిద్ది పాల్గొనేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. విద్యా రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారానికి ఎంపిక చేసింది. కొడంగల్ లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. జిల్లా కీర్తిని దశదిశలా చాటిన స్వప్నను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.























