మత్తు పదార్థాలపై అవగాహన
-పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి: ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని అంగడి బజార్ జామా మసీదు వద్ద శుక్రవారం ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ..పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని అన్నారు.మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వారి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.స్నేహితుల ప్రభావంతో తప్పుడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్, మైనార్టీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.























