గన్నారం జడ్పీహెచ్‌ఎస్‌లో శ్రీ సరస్వతీ దేవి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారికి విశేష పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, భవాని మాలధారులు, విద్యార్థులు..
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
గన్నారం: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు గన్నారం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలోని సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి రూపంలో అందంగా అలంకరించారు. తెల్లని వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గన్నారం గ్రామంలోని అమ్మవారి మండపాల్లో యజ్ఞ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.
ఈ ఉత్సవాల్లో గన్నారం గ్రామ ప్రజలు, మహిళలు, భవాని మాలధారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సందడితో అమ్మవారి మండపాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి.

























