రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కాలభైరవ స్వామిని దర్శించుకునేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. భక్తులు సిందూర పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భజనలు, భక్తి కీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. మంగళహారతుల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ప్రతి మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది భక్తులు అన్నదానంలో పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తుల సహకారంతో పూజా కార్యక్రమాలు, అన్నదానం నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కాలభైరవ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

























