గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రాజస్థాన్‌కు చెందిన నిందితుడి అరెస్ట్.. గ్యాస్ కట్టర్, స్కార్పియో వాహనం, నగదు స్వాధీనం
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: గాంధారిలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25,45,900 నగదు దోచుకున్న ఘటనలో రాజస్థాన్‌కు చెందిన రషీద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.29,400 నగదు, స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్, పనిముట్లు, కత్తులు, రెండు సెల్ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ సోమవారం కేసు వివరాలను వెల్లడించారు.
సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు
అక్టోబర్ 10, 11 తేదీల మధ్య రాత్రి గాంధారి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. మాస్కులు, టోపీలు ధరించి ఏటీఎం వద్దకు చేరుకున్న నిందితులు సీసీటీవీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చల్లారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి, నగదు ఉన్న ఐదు బాక్సులను నల్లరంగు స్కార్పియో వాహనంలో వేసుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై గాంధారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులు ఉపయోగించిన వాహనాన్ని గుర్తించారు. అసలు రిజిస్ట్రేషన్ నంబర్లకు బదులుగా ఇతర వాహనాల నంబర్ ప్లేట్లను అమర్చుకుని ప్రయాణించినట్లు గుర్తించారు.
రాజస్థాన్‌లో నిందితుడి అరెస్ట్
నిందితులు మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్‌కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. రాజస్థాన్‌లోని చేచాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల సమయంలో స్కార్పియో టైరు దెబ్బతినడంతో నిందితులు వాహనాన్ని వదిలి నగదు బ్యాగుతో పరారయ్యారు.
దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. అక్టోబర్ 20న భరత్పూర్ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న రషీద్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కామారెడ్డికి తీసుకొచ్చారు. అక్టోబర్ 21న చేచాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వదిలివేసిన స్కార్పియో వాహనాన్ని పరిశీలించి, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్, ఇతర పనిముట్లు, కత్తులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్లోనూ చోరీలకు పాల్పడినట్లు వెల్లడి
విచారణలో నిందితులు గత సెప్టెంబర్‌లో కరీంనగర్ ప్రాంతంలోని రెండు ఎస్బీఐ ఏటీఎంలలోనూ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజు, ఐటీ కోర్ ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సీసీఎస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, సదాశివనగర్ కానిస్టేబుల్ ఆజార్ తదితరులను ఎస్పీ అభినందించారు.

























