ప్రజావాణిలో 37 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
ప్రజా సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలి: సీపీ పి. సాయి చైతన్య…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, ప్రజల నుంచి 37 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీస్ కమిషనర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి, వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదులను స్వీకరించారు.

























