డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ బి. సుమలత…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించింది.
రెండు రోజుల క్రితం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
వారిలో సిరికొండ మండలం రామడుగు గ్రామానికి చెందిన రామడుగు సురేష్ (48), ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బోయ శ్రీనివాస్ (50) ఉన్నారు.
ఈ ఇద్దరినీ సోమవారం కోర్టులో హాజరుపరచగా, నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ ఎక్సైజ్ కోర్టు) న్యాయమూర్తి బాలరాజు ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్ఐ బి. సుమలత తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

























