నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఆదాయ వసూళ్ల పెంపు, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లపై అధికారులకు దిశానిర్దేశం…
నిజామాబాద్, నవంబర్ 12 : జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఐటీ, విజిలెన్స్ అండ్ రోడ్ సేఫ్టీ) ఎం. చంద్రశేఖర్ గౌడ్ బుధవారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కార్యాలయాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆదాయ వసూళ్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించారు. కౌంటర్ వారీగా, క్లర్క్ వారీగా జరుగుతున్న లావాదేవీలను పరిశీలించారు. లెర్నర్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ విభాగాల్లో ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
వాహన్ (VAHAN), సారథి (SARATHI), CFST పోర్టళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్, డిస్పాచ్ ప్రక్రియను వేగవంతం చేసి, కార్డులను ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు.
ఇన్‌స్పెక్టర్ల వారీగా ఆదాయ వసూళ్లను సమీక్షించి, ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాలని, అధిక లోడుతో ప్రయాణించే వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో అనధికార వ్యక్తులు, మధ్యవర్తుల ప్రవేశాన్ని పూర్తిగా నియంత్రించాలని, కార్యాలయ కార్యకలాపాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు ఇతర అధికారులు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ప్రజలకు రవాణా శాఖ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించడం, పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం, ప్రభుత్వ ఆదాయ వసూళ్లను మెరుగుపరచడం, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై రెండు జిల్లాల అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ జి. దుర్గ ప్రమీల, DTO రమేష్ రాథోడ్, RTO టి. సంతోష్ కుమార్, కామారెడ్డి RTO, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్, MVIs అశ్వంత్ కుమార్, రాహుల్, ప్రదీప్, AMVI రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

























