ఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం
ప్రచార రథానికి ఘన స్వాగతం పలికిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ…
ఇందూరు : భాగ్యనగరంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథం ఆదివారం ఇందూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రచార రథానికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమంలో ప్రతి అయ్యప్ప స్వామి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి నామాన్ని కోటి సార్లు జపించనున్నట్లు తెలిపారు. ప్రతి అయ్యప్ప స్వామికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశమని పేర్కొన్నారు. ఇందూరు నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రచార రథంతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మఠం పవన్, ఆగమయ్య గురుస్వామి, పార్శి రాజేందర్, రాజేష్ స్వామి, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

























