ఇసుక అక్రమ రవాణాపై చీత ఫోర్స్ మెరుపు దాడి – 1 భారీ లారీ స్వాధీనం : పోలీస్ కమీషనర్ వెల్లడి
ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., ప్రత్యేక ఆదేశాల మేరకు, అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చీత ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ఈ చర్యల్లో భాగంగా సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది ఈరోజు వెల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక భారీ 14 టైర్స్ లారీని గుర్తించి వెంటనే పట్టుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, ఆ లారీ ద్వారా ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తమైంది. వెంటనే వాహనాన్ని నిలిపివేసి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించినట్లు సమాచారం.
తరువాత పట్టుబడిన లారీని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత వెల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
*పోలీసుల హెచ్చరిక:*
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా వంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల్లో ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని, జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.
జిల్లాలో సహజ వనరుల సంరక్షణకు మరియు అక్రమ వ్యాపారాల నియంత్రణకు చీత ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

























