నిజామాబాద్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య…
నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రంతో పాటు చెవికమ్మలను అపహరించి పరారయ్యారు.
సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించి నిందితులను గుర్తించాలని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని కోరారు.
ఘటన స్థల పరిశీలనలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్–3 ఎస్సై హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

























