వర్షాలు లేక బీడువారిన భూములు.. రైతుల ఆవేదన…
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, చెరువులు, ప్రాజెక్టులు, బోరు బావులు ఎండిపోయాయి. జూన్‌లో వేసిన పత్తి, కంది, సోయా, జొన్న వంటి వర్షాధార పంటలు వాడిపోతున్నాయి. కొందరు రైతులు రెండోసారి విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, దండేపల్లి మండలాల్లోని రైతులు బావుల పూడిక తీయించడం, డ్రమ్ములు, బిందెలతో నీళ్లు తీసుకెళ్లి పంటలను తడపడం వంటి దీనమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకక గ్రామీణులు నరకయాతన పడుతున్నారు.























