మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
మోపాల్, జూలై 16 : రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ప్రాంతాన్ని గురువారం సందర్శించిన వారు రైతుల సమస్యలు, వినతులను స్వీకరించి ప్రాజెక్టు పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2009–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన అసలు డిజైన్‌తో ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయని తెలిపారు. సుమారు రూ.1,300 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో 85 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు డిజైన్‌ను రద్దు చేసి, రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిందని విమర్శించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.3,000 కోట్లకు పెరిగిందని, దాదాపు రూ.1,800 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఉపయోగపడేలా పనులు పూర్తి కాలేదని ఆరోపించారు.
తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టును భారీ ఖర్చుతో మార్చడం వెనుక కమీషన్ల రాజకీయాలే కారణమని విమర్శించిన వారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అందుకే గతంలో కాంగ్రెస్ రూపొందించిన పాత డిజైన్‌ను పునరుద్ధరించి అదే ప్రణాళికతో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు సాంకేతిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
రైతుల విజ్ఞప్తి మేరకు మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, ధర్పల్లి మండలాలకు ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రైతుల భూములకు నష్టం కలగకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోని సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. దాదాపు 50 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్స్ నిర్మాణం ద్వారా నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
త్వరలో సాంకేతిక ప్రణాళికలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని వృథా చేసే విధానాలకు బదులుగా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి నమూనానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాన్నే ఇతర ప్రాజెక్టుల్లోనూ అమలు చేయడం వల్ల వ్యయభారం పెరిగి ప్రాజెక్టుల లక్ష్యాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకత, శాస్త్రీయ ప్రణాళిక, రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























