ఆషాఢ మాసంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు… ఊర పండుగ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు: ఆషాఢ మాసంలో గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఇందూరులో ఈ నెల 2న సర్వసమాజ్ ఆధ్వర్యంలో జరిగే ఊర పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
శుక్రవారం నగరంలోని ఖిల్లా వద్ద ఉన్న అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట్, పెద్దబజార్ మీదుగా దుబ్బ వరకు వెళ్లే అమ్మవార్ల ఊరేగింపు మార్గాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే మామిడి చెట్టుతో సంప్రదాయబద్ధంగా తయారు చేసే దేవతా ప్రతిరూపాలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెను విస్తరించడంతో పాటు ఎత్తును కూడా పెంచినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు.
గాజులపేట్‌లోని ‘సరి’ వద్ద తోపులాటలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకతలాగే, ఇందూరులో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిర్వహించే అతిపెద్ద సాంప్రదాయ పండుగ ఊర పండుగ అని పేర్కొన్నారు.
సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామదేవతలను ప్రార్థిస్తూ ఈ పండుగను నిర్వహించడం ఇందూరుకు ప్రత్యేక సంప్రదాయమని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాజేశ్వర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, పసునూరి రాము, బెల్లాల్ శశాంక్, వైష్ణవి సుధా, కల్పే అర్చనా చిరంజీవి, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

























