యూరియా యాప్ను రద్దు చేయాలి
మాన్యువల్ విధానంలో ఎకరాకు నిర్ణీత పరిమాణంలో యూరియా పంపిణీ చేయాలి ఇందల్వాయి సొసైటీ భవనం ముందు రైతుల ధర్నా…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి, సెప్టెంబర్ 04: యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, ప్రతి రైతుకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం ఇందల్వాయి వ్యవసాయ సహకార సంఘం భవనం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి రైతుకు ఎకరాకు నిర్ణీత సంఖ్యలో యూరియా సంచులు కేటాయించి వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఎస్ఐ సుమలత, సొసైటీ చైర్మన్ సిహెచ్. గోపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి యూరియా యాప్ విధానం, దాని ద్వారా పంపిణీ జరుగుతున్న తీరును వివరించారు. అయితే రైతులు మాత్రం యాప్ విధానాన్ని రద్దు చేసి, మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని పట్టుబట్టారు.
రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ధర్నాలో పలువురు రైతులు పాల్గొన్నారు.

























