స్త్రీనిధి రుణాల ఆన్లైన్ చెల్లింపుల్లో డిచ్పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల స్త్రీనిధి సమాఖ్య స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబరిచింది. “మన స్త్రీనిధి” యాప్ ద్వారా రుణాల ఆన్లైన్ చెల్లింపుల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.9.36 కోట్ల రుణ పంపిణీ లక్ష్యానికి గాను రూ.9.46 కోట్ల రుణాలను పంపిణీ చేసి 105 శాతం లక్ష్యాన్ని సాధించింది. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు స్త్రీనిధి ద్వారా వివిధ రకాల రుణాలను అందిస్తున్నారు.
ఇందులో భాగంగా మండలంలో స్త్రీనిధి రుణాల ద్వారా 3 ఎలక్ట్రికల్ ఆటోలు, 10 ఎలక్ట్రికల్ స్కూటీలను మహిళా సంఘాల సభ్యులకు అందించారు. దీంతో మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఏర్పడ్డాయి.
అదేవిధంగా సంఘాల రుణాలను సకాలంలో చెల్లించేలా సభ్యులకు అవగాహన కల్పించడం, “మన స్త్రీనిధి” యాప్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా రుణాల రికవరీలో మండలం మంచి ప్రగతి సాధించింది. ఈ కృషి ఫలితంగానే జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
ఈ సందర్భంగా జిల్లా సమాఖ్యలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్డీఓ చేతుల మీదుగా డిచ్పల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, వీఓ ప్రతినిధులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, స్త్రీనిధి సిబ్బంది, సంబంధిత సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాఖ్య అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు, వీఓలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, స్త్రీనిధి సిబ్బంది సమష్టి కృషి, సంఘ సభ్యుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. భవిష్యత్తులో కూడా డిచ్పల్లి మండలాన్ని స్త్రీనిధి కార్యక్రమాల్లో ముందువరుసలో నిలిపేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.
విజయానికి కృషి చేసిన సమాఖ్య అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు, వీఓలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, స్త్రీనిధి మేనేజర్ రాఘవ, సీసీల సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీఎం రవీందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

























