NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.
సోమవారం ఎమ్మెల్యేను కలిసిన NHM ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత 14 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు వివరించారు.
ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు కోరారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని కోరారు.
అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు.
NHM ఉద్యోగుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో NHM జిల్లా జేఏసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

























