ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు
ఎల్నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించి చిన్నారి గుమ్ముల ఐరా కుటుంబం ఆదర్శంగా నిలిచింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు తమ కుమార్తె ఐరా మొదటి పుట్టినరోజు సందర్భంగా భీమ్గల్ మండలం మెండోరా, వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందిస్తూ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.
సాధారణంగా పుట్టినరోజు వేడుకల కోసం కేకులు, ఫ్లెక్సీలు, ఇతర ఆడంబరాలపై ఖర్చు చేసే బదులు, సుమారు రూ.30 వేలతో నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
12 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి ద్వారా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ఐఏఎస్ సేవా భావనతో స్ఫూర్తి పొందిన గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భీమ్గల్ మండలం మెండోరా గ్రామం, వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాల్లో మొత్తం 12 మంది నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కొక్క కుటుంబానికి 15 రోజుల పాటు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, పప్పులు, ఫ్రీడమ్ వంటనూనె, కొబ్బరి నూనె, ఆశీర్వాద్ ఆటా, కారం, పసుపు తదితర సరుకులను అందజేశారు. ఈ సరుకుల విలువ సుమారు రూ.20 వేలుగా తెలిపారు.
100 మందికి అన్నదానం
అదేవిధంగా శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు చికెన్ బిర్యానీ, వాటర్ బాటిళ్లతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం సుమారు రూ.10 వేలు ఖర్చు చేశారు. పుట్టినరోజు వేడుకను పేదల ఆకలి తీర్చే కార్యక్రమంగా మార్చి, సామాజిక సేవకు ప్రాధాన్యతనిచ్చారు.
రామన్నపేట గ్రామంలో సర్పంచ్ నవీన్, గుమ్ముల ధర్మారెడ్డి, సురేష్, రమేష్, కుటుంబ సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మెండోరా గ్రామంలో సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, కుంట గిర్ని రాజన్న, కుంట గంగారెడ్డి, పల్లె శేఖర్ తదితరులు పేదలకు సరుకులు అందజేశారు.
చిన్నారి పుట్టినరోజుతో సామాజిక సేవకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకల పేరుతో అనవసర ఆడంబరాలకు ఖర్చు చేయకుండా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చిన్న వయస్సు నుంచే పిల్లలకు సేవాభావం, సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పేద కుటుంబాలకు అండగా నిలవడం ఎంతో అవసరమని, గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు కొనియాడారు.

























