ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు అందరు పాటుపడాలని మున్సిపల్ చైర్పర్సన్ బోధిరే నాగమణి స్వామి తెలిపారు..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ పట్టణంలోని 9వ వార్డులో ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించి పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని, వాటికి బదులుగా స్టీల్ పాత్రలు, పునర్వినియోగ వస్తువులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రజలు విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. ఇందిర మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును పట్టణ ప్రజలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలు, కుటుంబ వేడుకలు, సామాజిక కార్యక్రమాల్లో వినియోగించి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి వార్డులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్వచ్ఛమైన, హరితమైన, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ–నాగేంద్రబాబు, పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మి భగత్, బోదిరే లావణ్య నర్సయ్య, అంజుమ్ ఆలీ, సందీప్, నీలం రవి, సంగ్య నాయక్, మల్లెల అనుపమ ప్రసాద్, మేనేజర్ నరేందర్, ఏడీఎంసీ నందన్ రెడ్డి, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇందిర మహిళా శక్తి సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.























