జీకే తండాలో అటవీ సంరక్షణ సమన్వయ సమావేశం…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఈరోజు తేదీ 14-10-2026న నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలంలోని జీకే తండా గ్రామంలో అటవీ శాఖ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) రవి మోహన్ బట్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో చెట్లను అక్రమంగా నరకడం, అటవీ భూములను ఆక్రమించడం, వన్యప్రాణులను వేటాడటం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని గ్రామ ప్రజలకు సూచించారు. అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రెవెన్యూ శాఖ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) మాట్లాడుతూ, ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించవద్దని, అటవీ భూముల పరిరక్షణకు అటవీ మరియు రెవెన్యూ శాఖలకు సహకరించాలని గ్రామ ప్రజలకు సూచించారు.
పోలీస్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చడం, విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇటువంటి చర్యల వల్ల వన్యప్రాణులతో పాటు ప్రజలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తో పాటు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది, రెవెన్యూ శాఖ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఇందల్వాయి మండల వ్యవసాయ అధికారి (AO), గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ మరియు అటవీ భూముల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

























