నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
26వ డివిజన్‌లో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు: నిజామాబాద్ నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
నగరంలోని 26వ డివిజన్‌లో చేపట్టనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మున్సిపల్ కార్పొరేషన్‌లో పాలకవర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశాలు జరగకపోవడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడిందన్నారు.
ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి డివిజన్‌లో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌తో పాటు ఖిల్లా రామాలయం వద్ద రోప్‌వే ఏర్పాటు కోసం డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) కూడా సిద్ధమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, స్థానిక కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

























