కులమతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యం
వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీటి సమస్యలు తీరాలి.. రైతులను ఆదుకోవాలి
ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్, అక్టోబర్ 17 : కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, మానవత్వం, సోదరభావం, మంచి నడవడిక, నైతిక విలువలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్ పిలుపునిచ్చారు. దేవీ శరన్నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం దేవన్‌పల్లి గ్రామానికి చెందిన ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్ భీమ్‌గల్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల పరిధి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం, మానవత్వం వెల్లివిరిసి నప్పుడే నిజమైన ఐక్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పండుగలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటాలని ఆకాంక్షించారు.
*రైతుల కష్టాలు తీరాలి.. వర్షాలు కురవాలి*
భీమ్‌గల్ ప్రాంత ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయమేనని, వర్షాలు తగ్గడంతో రైతులు సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రబోధ్ సుమేర్ ఆవేదన వ్యక్తం చేశారు.తల్లి దుర్గమ్మ కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, చెరువులు, కుంటలు నిండి సాగునీటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించారు. పంటలు పుష్కలంగా పండి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, వ్యవసాయంపై ఆధారపడిన పేదలకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ఆకాంక్షించారు.
*ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి*
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని ఆయన అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సమస్యలు తొలగిపోయి అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ పరస్పర సహకారం, మానవత్వంతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

























