దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. స్వామివారి నామస్మరణలు, గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
భీంగల్ ప్రాంతంతో పాటు నిజామాబాద్ జిల్లా, మహారాష్ట్ర, మెట్పల్లి, కోరుట్ల, నాందేడ్, ధర్మారం, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
కొంతమంది భక్తులు కొండపై వంటలు చేసుకుని, ఉపవాస దీక్షలు పాటిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులు ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

























