కండక్టర్ ప్రవళిక మృతికి ఆర్మూర్ డిపో జేఏసీ నివాళులు
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా సంతాపం.. కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కె. నగేష్
ఆర్మూర్: టీజీఎస్‌ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక ఆకస్మిక మృతికి సంతాపంగా ఆర్మూర్ డిపో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డిపో ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, డ్రైవర్లు, మహిళా కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని “ప్రవళిక అమర్ రహే” అంటూ నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రవళిక తల్లి, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఆర్గుల్ రమేష్, డీవీఎస్ చక్రవర్తి, బండి రవీందర్ తదితరులు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ ఉన్నతాధికారులు, యాజమాన్యం తక్షణమే సమీక్ష నిర్వహించి ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవళిక కుటుంబానికి సంస్థ తరఫున అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
ఈ సంతాప కార్యక్రమంలో జేఏసీ నాయకులు, డిపో కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రవళికకు నివాళులర్పించారు.

























