రైతులు క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,960 కంటే తక్కువకు విక్రయించవద్దు
రైతులకు డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సూచన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని రైతులు తమ వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,960 కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సూచించారు. శుక్రవారం ధర్పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈసారి మంచి వర్షాలు కురవడంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో సమృద్ధిగా వరి పంట పండిందని తెలిపారు. పంట కోతలు ప్రారంభమైన సమయంలో ప్రభుత్వ మద్దతు ధరకు బోనస్ కలిపి లభించే ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు అధిక ధర చెల్లించడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యమైందన్నారు.
ప్రస్తుతం సుమారు 70 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గురువారం నుంచి సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు.
ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎమ్మెల్యే చొరవతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ చిన్న బాల్రాజ్ హామీ ఇచ్చారు.

























