దుబ్బాకలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల నమోదు 20 శాతం పూర్తి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు గ్రామంలో 20 శాతం దరఖాస్తుల నమోదు పూర్తయినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తెలిపారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తుల నమోదును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సరోజినీ దేవి గంగాధర్, ఉపసర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని తెలిపారు. అర్హులైన వారు అవసరమైన వివరాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల నమోదుకు గ్రామపంచాయతీ సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.

























