భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం
మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతరకు విచ్చేసిన భక్తులకు సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందించే సేవలు, మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181, బాల్యవివాహ నిషేధ చట్టం, పోక్సో (POCSO) చట్టంపై అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలను గుర్తించడం, వాటిని నివారించడం, బాలికలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం, మహిళలు మరియు పిల్లల హక్కులను తెలుసుకోవడం వంటి అంశాలను వివరించారు. మహిళలు, పిల్లలపై జరిగే హింస లేదా వేధింపులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అలాగే వ్యక్తిగత భద్రత, ఆపద సమయంలో తక్షణ సహాయం పొందడం, సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, ఇతర సహాయ సేవలను ఎలా పొందవచ్చో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు, సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలు, మహిళా హెల్ప్‌లైన్ 181కు సంబంధించిన ఐఈసీ (IEC) అవగాహన కరపత్రాలను భక్తులకు పంపిణీ చేశారు.
మహిళలు, పిల్లల రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలు, సహాయ వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించి, సురక్షితమైన, హింసారహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

























