ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార దళ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడమే కాకుండా, దాని గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయడం ఎంతో ముఖ్యమన్నారు. 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వారసత్వానికి గౌరవం కల్పించారని తెలిపారు. రాజ్యాంగం దేశానికి దిక్సూచి కాగా, ప్రజాస్వామ్యం దేశానికి ప్రాణవాయువు అని అన్నారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.

























